రాజస్థాన్‌లో ఈ 8 ఈవెంట్స్ మిస్ చేసుకోకండి!
భారతీయ రాజరిక సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాలు రాజస్థాన్. అనేక ప్రాంతాల్లో ఈ గతకాలపు చిహ్నాలు ఉన్నా.. రాజస్థాన్‌లో ఇవి మరింతగా కనిపిస్తాయి. ఆధునికత అంతకంతకూ విస్తరిస్తున్నా.. తమ సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగించడంలో రాజస్థాన్ ప్రముఖంగా నిలుస్తుంది. అద్భుతమైన సౌందర్యం మాత్రమే కాదు, అనిర్వచనీయమైన ఆతిథ్యానికి కూడా ఈ ప్రాంతం పుట్టినిల్లు. రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించడం అంటే అది ఒక టూర్‌గా మాత్రమే కాకుండా.. ఓ చిరస్మరణీయమైన అనుభూతులను సొంతం చేసుకోవడమే. అక్కడ జరుపుకునే కొన్ని పండుగలు, కార్యక్రమాలను అసలు మిస్ కాకూడదు. ప్రతి క్షణం పర్యాటకుల పదిలంగా నిలిచిపోయేలా రాజస్థాన్‌లో కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
1. గంగౌర్ పండుగ:
మహాశివుని భార్య పార్వతీ దేవిని ధర్మం, దైవత్వాలకు చిహ్నంగానే కాదు, వివాహిత మహిళలకు ఆరాధ్య దైవం కూడా. ఆమెకు గౌరవ సూచకంగానే గంగౌర్ పండుగను నిర్వహిస్తారు. ఉదయపూర్, జైపూర్, మండవ నగరాల్లో.. మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ఈ వేడుకలు జరుగుతాయి. మహిళలు, యవతులు సాంప్రదాయ వస్త్రాలు అయిన లెహంగా లేదా చనియా చోళీలను ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. శివ పార్వతులను ఆరాధిస్తారు. అవివాహిత యువతులు తమకు కాబోయే వరుడి కోసం ప్రార్ధనలు చేస్తే, వివాహితులు తమ భర్త భద్రత, ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. మహాశివుడు వచ్చిన తన భార్యను ఇంటికి తీసుకెళతాడని భక్తుల అచంచల విశ్వాసం. హోళీ తర్వాత రెండు వారాల పాటు ఈ పండుగ జరుగుతుంది.
2. మేవార్ వేడుక:
వసంత రుతువును ఆహ్వానిస్తూ ఉదయపూర్‌లో అత్యంత అద్భుతంగా జరుపుకునే వేడుక మేవార్ పండుగ. పట్టణం అంతా అలంకరణలతో కళకళలాడుతుంది.. వేడుకలతో అలరారుతుంది. గంగౌర్ పండుగ మాదిరిగానే మేవార్‌కు కూడా రాజస్థాన్ మహిళల్లో చాలానే ప్రాధ్యత ఉంటుంది. శివ పార్వతుల విగ్రహాలను అలంకరించేందుకు మహిళలు అంతా గుంపులుగా చేరుతారు. అలంకరణ పూర్తి అయిన తర్వాత ఆయా విగ్రహాలను ఊరేగింపుగా నగరం అంతా పలు ప్రాంతాలలో తిప్పుతారు. చివరకు అందరూ కలిసి పిచోళా సరస్సు దగ్గర ఉన్న గంగౌర్ ఘాట్ దగ్గరకు చేరుతారు. ఆ తరువతా ప్రత్యేకమైన పడవలలో ఆ విగ్రహాలను ఉంచి, సరస్సులో నిమజ్జనం చేస్తారు.
3. జోధ్‌పూర్ ఎడారి ఉత్సవం:
జనవరి నెలలో జోధ్‌పూర్ ఎడారి ఉత్సవం జరుగుతుంది. జైసల్మీర్‌కు 24కిలోమీటర్ల దూరంలో ఉన్న శామ్ శాండ్ డ్యూన్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. రాజస్థాన్ మొత్తం నుంచి అనేక ఒంటెలను ఇక్కడకు చేర్చి.. అద్భుతమైన ప్రదర్శన నిర్వహిస్తారు. సంతోష సంబరాల మధ్య 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. రాజస్థాన్‌కు ప్రత్యేకమైన సాంస్కృతిక కళలు, సంగీతం, నృత్యాలతో అద్భుతమైన ప్రదర్శనలు జరుగుతాయి. ఒంటెల పందేలు, పప్పెట్ షోస్, అగ్ని మధ్యలో నృత్యం, టర్బన్ పోటీ, మిస్టర్ డెజర్ట్ కాంటెస్ట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఎన్నో పోటీలు, కార్యక్రమాలను నిర్వహిస్తారు. చీకటి పడిన తర్వాత సైనికులు, రాజులపై ఆకట్టుకునే పాటలు అందరినీ కట్టిపడేస్తాయి. రాజస్థాన్‌లో మాత్రమే కనిపించే ఈ వేడుకలను తప్పనిసరిగా చూడాల్సిందే.
4. పుష్కర ఉత్సవం:
నవంబర్‌లో జరిగే ఈ పుష్కర ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సమయంలో పుష్కర్ ప్రాంతం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతారు. వేల కొద్దీ పర్యాటకులు పుష్కర్ సరస్సులో స్నానం ఆచరించి, బ్రహ్మ దేవుని ఆలయాన్ని సందర్శించుకుంటారు. పెంపకందారులు, రైతులు, ఒంటెల వ్యాపారులు అందరూ కలిసి ఒక చోటకు చేరి పశువులు, ఒంటెల అమ్మకాలు, కొనుగోళ్లను చేసే అతి పెద్ద పండుగ ఇది. జానపద గీతాలు, నృత్యాలతో పాటు బోలెడంత షాపింగ్ సౌలభ్యం కూడా ఉంటుంది. రాజస్థాన్ పర్యటనల్లోనే అత్యంత ప్రత్యేకం ఈ పుష్కర్ ఉత్సవం.
5. మార్వార్ ఉత్సవం:
మార్వార్ ప్రాంతానికి సంబంధించిన నృత్యాలు, సంగీతాలకు ప్రత్యేకమైన పండుగ మార్వార్ ఉత్సవం. జోధ్‌పూర్ నగరంలో అక్టోబర్ నెలలో ఈ ఉత్సవం డరుగుతుంది. జోధ్‌పూర్ కళలు, సంస్కృతులకు ప్రతిబింబంగా నిలిచే ఈ వేడుకలలో మాంద్ పండుగకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
6. తీజ్ వేడుకలు:
ఆగస్ట్ నెలలో వర్షాకాలం ప్రారంభంలో తీజ్ వేడుకలు జరుగుతాయి. ఎక్కువగా జైపూర్‌లో ఈ వేడుకలు కనిపించినా, రాష్ట్రం మొత్తం జరుగుతాయి. నృత్యాలు, పాటలతో రెండు రోజుల పాటు అమ్మవారు పార్వతీదేవి విగ్రహాన్ని ఊరేగిస్తారు.
7. జైపూర్ థియేటర్ ఫెస్టివల్ – జైరంగం:
జైపూర్‌లో జరిగే జైరంగం.. వార్షికంగా నిర్వహించే నేషనల్ థియేటర్ ఫెస్టివల్. దేశవ్యాప్తంగా థియేటర్లకు సంబంధించిన కార్యక్రమాలను ఎంపిక చేసి వారం రోజుల పాటు ప్రదర్శిస్తారు. థియేటర్‌కు సంబంధించిన ప్రపంచవ్యాప్త ప్రముఖులు జైపూర్‌కు వచ్చి, తమ ఉత్తమ నటనను ప్రదర్శిస్తారు. ప్రతీ థియేటర్ ఆర్టిస్ట్‌కు ఇది ఒక స్వర్గధామం.
8. ది సమ్మర్ ఫెస్టివల్:
రాజస్థాన్‌లో ఉన్న ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబులో సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది. వేసవిలో అంటే జూన్‌లో జరిగే ఏకైక వేడుక ఇది. ఈ ప్రాంతానికి చెందిన భిల్ తెగకు చెందిన వారు సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, సంగీతాన్ని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలతో ఈ ప్రాంతంలో సంతోషం, సంబరాలతో వెల్లివిరిస్తుంది. వీటిని చూసిన పర్యాటకులు ఎప్పటికీ మౌంట్ అబు పర్యటనను మరచిపోలేరు.
రాజస్థాన్‌ను కేవలం సందర్శించడమే కాదు, రాజస్థాన్ అందాలను అనుభవించాల్సిందే. ఇవి అక్కడ మాత్రమే జరిగి 8 ప్రత్యేకమైన పండుగలు. ఈ 8 వేడుకలను అస్సలు మిస్ చేసుకోకూడదు. రాజస్థాన్‌కు మీరు వెళ్లాలని భావించినపుడు, ఈ సమయాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే, మీ టూర్ చిరకాలం మదిలో నిలిచిపోతుంది.